టిఆర్ఎస్ మంత్రులు, శాసనసభ్యులు, బిజెపికి చెందిన కీలక నేతలు మాతో టచ్ లో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. వారంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలిపారు. పార్టీలో చేరికలపై నెల రోజుల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారని అన్నారు మహేష్ గౌడ్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఏఐసీసీ పరిశీలిస్తుందని తెలిపారు.
కేసీ వేణుగోపాల్ తో ముఖ్య నేతలు, నల్గొండ జిల్లా నేతలతో చర్చించారని.. మునుగోడుపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మునుగోడును నల్గొండ జిల్లా నేతలు చూసుకుంటారని .. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యేగా ఉన్నాడని.. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. బిజెపి చాలామంది నేతలను ఈడి బూచితో బెదిరించి వాళ్ల పార్టీలోకి లాగాలని చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపి పాచికలు పారవన్నారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపి 10 నుంచి 12 నియోజకవర్గాలకే పరిమితం అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది తాను చెప్పేది కాదని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని అన్నారు మహేష్ గౌడ్.