హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. తమకు పూర్తి బలం ఉన్నా సరే ఒక్క నియోజకవర్గంలో గెలవడం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు ఈటలని ఓడించాలనే కసితో అధికార టీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో కేసీఆర్ ముందుకెళుతున్నారు. అసలు ఎప్పుడూలేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవాలని చూస్తున్న కేసీఆర్, రాజకీయంగా కూడా బలపడటానికి చూస్తున్నారు.
ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులని టీఆర్ఎస్‌లో చేర్చుకున్న టీఆర్ఎస్, ఈటల బలాన్ని ఇంకా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ వర్గాన్ని టార్గెట్ చేసి హరీష్ రావు ముందుకెళుతున్నారు. గత కొంతకాలంగా ఈటల అనుచరులని మళ్ళీ టీఆర్ఎస్‌లోకి తీసుకురావడానికి చూస్తున్నారు. తాజాగా కూడా ఈటలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జిల్లా సహకార బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు చుక్కా రంజిత్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
వీరితో పాటు జమ్మికుంట ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలువురు బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇదంతా హరీష్ వ్యూహామని తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది అర్ధం కాకుండా ఉంది. రమేష్ వచ్చి ఈటల సామాజికవర్గమైన ముదిరాజ్‌లకు చెందిన నాయకుడు. రమేష్ టీఆర్ఎస్‌లోకి రావడం వల్ల ముదిరాజ్‌ల ఓట్లు టీఆర్ఎస్‌కు కొన్ని పడతాయని అనుకుంటున్నారు.
అటు గౌడ సామాజిక వర్గంలో మంచి పేరున్న చుక్కా రంజిత్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొస్తుందని అనుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్తితులు అలా కనిపించడం లేదు. నాయకులైతే పార్టీలు మారుతున్నారు గానీ, ఆయా సామాజికవర్గాలు మాత్రం ఈటలకే ఎక్కువ మద్ధతుగా ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి టీఆర్ఎస్ ప్లాన్ రివర్స్ అయ్యి, ఈటలకు షాక్ కొట్టడం జరిగే పని కాదని తెలుస్తోంది.