పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల వేదికగా గులాబీ బాస్ కేసీఆర్ తన లక్ష్యాన్నిమరోసారి ప్రస్ఫుటం చేశారు. తమ కంచుకోటను ఎవరూ బద్దలు కొట్టలేరని పేర్కొంటూనే… కేంద్రంలో బీజేపీని బద్దలు కొట్టడమే తమ పార్టీ లక్ష్యమని తేల్చేశారు. ఈ విషయంలో తగ్గేదేలేదని మరోసారి తెగేసి చెప్పారు.
వాస్తవానికి ఏ పార్టీ ప్లీనరీలో అయినా.. పార్టీ పటిష్ఠతకు తీసుకున్న చర్యలను వివరిస్తారు. తీసుకోబోయే ప్రణాళికలనువిశదీకరిస్తారు. లేదంటే తమ ప్రభుత్వ విజయాలను కొనియాడుతారు. సాధించిన విజయాలను, తద్వారా ప్రజలకు అందిన ఫలాలను వివరిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్నది
కానీ.. టీఆర్ఎస్ ప్లీనరీలో 11 తీర్మానాలు చేస్తే.. అందులో 9 తీర్మానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ గా చేసినవే కావడం గమనార్హం. ఇందులో కొన్ని డిమాండ్లు ఉండగా.. మరికొన్నికేంద్ర వైఫల్యాలను ఎత్తి చూపేలా ఉండటం విశేషం. మరికొన్ని ప్రజలకు పిలుపునిచ్చేవిగా ఉండటం కొసమెరుపు.
వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ ఓ తీర్మానం కూడా ఉంది. అలాగే.. జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్ కీలక పాత్ర పోషించాలని పేర్కొంటూ మరో కీలక తీర్మానం కూడా చేసింది. తద్వారా ప్లీనరీ వేదికగా తమ టార్గెట్ ను కేసీఆర్ పార్టీ శ్రేణులకు వివరించినట్లయింది.
ముఖ్యంగా.. బీజేపీపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శల ఆధారంగా పలు తీర్మానాలు ఉండటం గమనార్హం. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని , రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని వంటి తీర్మానాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించి.. ధరలు నియంత్రించాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసి అమలు చేయాలని, బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బీసీ వర్గాల జనగణన జరపాలని, తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని వంటి డిమాండ్లు ఉన్నాయి.
రాష్ట్రానికి సంబంధించి.. కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని, రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని, దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా 11 తీర్మానాలు చేయగా.. అందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 తీర్మానాలు కేంద్రాన్ని డిమాండ్ చేయడమో లేదా కేంద్ర వైఖరిని నిలదీయడమో వంటి అంశాలుగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్రంపై పోరును కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఈ తీర్మానాల ద్వారా తగ్గేదేలే అన్న సంకేతాలను ఇచ్చినట్లయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.