తెలంగాణ విద్యాశాఖ నూతన అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణలో జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ (2022-23) విడుదలైంది. ఈ విద్యాసంవత్సరం 230 పని దినాలు ఉండనున్నాయి. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 4 ఏప్రిల్ 2023న ముగియనుంది. వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు 14 రోజులు దసరా సెలవులు. దీనితో పాటు.. జనవరి 13 నుండి జనవరి 17 వరకు పాఠశాలలకు ఐదు రోజులు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా విద్యాశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 తేదీ వరకు సిలబస్ పూర్తి అయ్యేవిధంగా, అలాగే మార్చి నెలలో జరిగే ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయనున్నట్లు క్యాలెండర్‌లో వెల్లడించారు అధికారులు.