జగన్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్

-

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సుదీర్ఘంగా కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలపై చర్చించారు. ఏపీలో అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే మూర్ఖంగా ముందుకు వెళ్తున్నాడని ఆక్షేపించారు. తెలంగాణకు దక్కాల్సిన నీళ్ల విషయంలో జగన్ చట్టాలను గౌరవించడంలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ భేటీలో ఇంకా చర్చించిన అంశాలు ఇవే..
ఇప్పటికే ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ కేబినెట్‌కు నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఎన్‌జీ‌టీ‌తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని కేబినెట్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లాలని కేబినెట్ అభిప్రాయపడింది.

రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలివి..
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ)ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది.

పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించింది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని, నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు ఈ ప్రాజెక్టులకు సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌లు తయారీ‌ చేయాలని సాగునీటి శాఖను కేబినెట్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version