త్రీ క్యాపిటల్స్‌లో ట్విస్ట్…మరి ఏపీ రాజధాని ఏది?

-

ఏపీ రాజధానిలో మొదట నుంచి అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలో వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ దీన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని పోరాడింది.

ఇక అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..రెండేళ్లుగా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమం చేస్తున్నారు. కానీ ఎప్పుడు రైతుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల్లో ట్విస్ట్ ఇచ్చింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని జగన్ ప్రకటించారు. ఇదే క్రమంలో కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేశామని, రాజధానిపై తమ నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారని, వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టామని, అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవని చెబుతూనే ఒక ట్విస్ట్ ఇచ్చారు.. సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తామని, అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతామని జగన్ చెప్పారు.

అంటే మూడు రాజధానుల రద్దు అయ్యాయి…అది మాత్రం తెలుస్తోంది. మరి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించి..అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా అనేది క్లారిటీ లేదు. మళ్ళీ బిల్లు తెస్తామని అంటున్నారు. అంటే అది మూడు రాజధానుల బిల్లు అవుతుందో…ఒకే రాజధాని ఉంటుందో తెలియడం లేదు. అంటే ఇప్పటికీ ఏపీ రాజధాని ఏది అనేది క్లారిటీ లేదనే చెప్పాలి. మరి రాజధాని అంశం ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news