అధికారంలో ఉంటూ బలంగా ఉన్న వైసీపీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు..ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది…అలాగే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోవడం కావొచ్చు…పైనున్న నేతలు కింది స్థాయి కార్యకర్తలని పట్టించుకోకపోవడం, సీట్ల విషయంలో అప్పుడే నేతల మధ్య విభేదాలు రావడం ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో కూడా సమస్యలు చాలానే ఉన్నాయి.
ఇదే క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో అనేక ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది…ఈ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది..అలాగే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య రగడ నడుస్తోంది. ఇక జిల్లాలో సీట్ల కేటాయింపు విషయంలో కూడా కొన్ని ట్విస్ట్ లు నడుస్తున్నాయి. ముఖ్యంగా పర్చూరు, చీరాల సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు సీట్లు టీడీపీ గెలుచుకుంది.
అయితే టీడీపీ నుంచి గెలిచిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ వైపుకు వచ్చారు.. ఇక కరణం మీద ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాలలోనే ఉన్నారు. వీరి మధ్య చీరాల సీటు విషయంలో రగడ నడుస్తోంది. ఇదే సమయంలో ఆమంచిని పర్చూరుకు పంపించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది…కానీ అందుకు ఆమంచి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇక పర్చూరులో ఇంచార్జ్ గా ఉన్న రావి రామనాథం బాబుని మార్చాలని వైసీపీ భావిస్తుంది.
గత ఎన్నికల్లో ఈ సీటు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇచ్చారు…కానీ ఆయన ఓడిపోయారు. అయితే సీటు రాకపోవడంతో రావి టీడీపీలోకి వచ్చి..ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికలయ్యాక దగ్గుబాటి వైసీపీకి దూరం జరిగారు. దీంతో రావి మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఇంచార్జ్ అయ్యారు. కానీ టీడీపీ కోసం పనిచేసి వచ్చిన రావికి వైసీపీ శ్రేణులు సహకరించడం లేదు. ఇదే సమయంలో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డిని ఇంచార్జ్ గా పెడతారని ప్రచారం జరిగింది.
కానీ పర్చూరులో కాపుల బలం ఎక్కువ…అందుకే ఓ కాపు నేతకు ఇంచార్జ్ పదవి ఇస్తే బెటర్ అని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందట. ఎలాగోలా నచ్చజెప్పి ఆమంచిని పర్చూరుకు పంపాలని చూస్తుంది. అయితే ఇంతవరకు పర్చూరు, చీరాల సీట్ల విషయం మాత్రం తేలడం లేదు.