త్వరలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అందుకు అనుగుణంగా కొత్త మంత్రుల జాబితాను సైతం సిద్ధం చేశారు.ఈ క్రమంలో పాత ముఖాలు కొన్ని రిపీట్ కానున్నాయి. కొత్త ముఖాలు కొన్ని మళ్లీ తెరపైకి రానున్నాయి. పాత వారిలో నలుగురైదుగురు మినహా మిగతా వారంతా కొత్తవారే ఈ సారి క్యాబినెట్ లో కనిపించనున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా పెద్ది రెడ్డి ని రిపీట్ చేయొచ్చు అని కొందరు కాదని కొందరు అంటున్నారు. ఇదే కోవలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ లీడర్ మంత్రి బొత్సను కూడా రిపీట్ చేయొచ్చు అని కొందరు కాదని కొందరు అంటున్నారు. వేటిపై కూడా పూర్తి స్పష్టత అయితే లేదు. అన్నీ ఊహాగానాలే! ముఖ్యమంత్రి తనకు తానుగా ఏ నిర్ణయమూ చెప్పడం లేదు.
ఇక మంత్రులంతా సమర్థులేనా అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. సమర్థతకు ప్రామాణికం ఏంటన్నది ఇప్పుడొక చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యలు అనుసారం.. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం క్యాబినెట్ లో సమర్థులను ఇంకొందరిని తీసుకోవాలని భావిస్తున్నారని నిర్థారణ అయింది. అంటే ఇంత కాలం పనిచేసే మంత్రులు సమర్థులుగా లేరు అని నిర్థారించారా లేదా వీరిని మించిన సమర్థులు జూనియర్లలో ఉన్నారు అని భావిస్తున్నారా ?
వాస్తవానికి గత కొద్ది రోజులుగా మంత్రి వర్గ మార్పులపై ఎన్నో తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్లను తప్పించి జూనియర్లకు చోటు ఇవ్వాలని అనుకుంటున్నారని, ఇప్పటిదాకా పనిచేసిన క్యాబినెట్ సహచరులకు జిల్లాల అధ్యక్షులుగా
నియమించాలని అదేవిధంగా ఇంకొందరిని రీజనల్ కో ఆర్డినేటర్లుగా నియమించాలని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే
కొందరు సీనియర్లు పార్టీకి మరింత దూరం అవుతారు. ఆశావహులకు పదవులు దక్కకపోతే వారి అసంతృప్తి తారా స్థాయికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పరిష్కరించడం అనుకున్నంత సులువు కాదు. కనుక మంత్రి వర్గ కూర్పు అన్నది కత్తి మీద సాము లాంటిదే !