ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం ప్రారంభించి ఏడాది కావొస్తోంది. ఈ యుద్ధం ముగియాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. కొన్ని దేశాలు దానికోసం ప్రయత్నిస్తున్నాయి కూడా. ఈ ప్రయత్నాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ముగించేలా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను నరేంద్ర మోదీ మాత్రమే ఒప్పించగలరని అమెరికా అభిప్రాయపడింది.
‘పుతిన్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇంకా సమయం ఉందని నేను భావిస్తున్నాను. ప్రధాని మోదీ ఆయన్ను ఒప్పించగలరు. అందుకోసం ఆయన తీసుకునే ఏ చర్యలైనా మాకు అంగీకారమే. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన ఒకే ఒక్క వ్యక్తి పుతిన్. ఆ దురాక్రమణను ఆయన ఇప్పటికిప్పుడే ఆపగలడు. కానీ దానికి బదులు క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి, అక్కడి ప్రజలను మరింత ఇక్కట్లకు గురిచేస్తున్నాడు’ అని శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీ వెల్లడించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన మరుసటి రోజు ఈ స్పందన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.