పన్నేండేళ్ల వయసులోనే భారీ బాధ్యతలను తన భుజాన వేసుకుని వ్యాపారంలో రాణించడంతోపాటు.. మంచి గుర్తింపు దక్కించుకున్నారు వద్దిరాజు రవిచంద్ర. రైస్ మిల్లులో మొదలైన తన ప్రయాణం.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి).. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తి గ్రామంలో జన్మించారు. తన తండ్రి వెంకట నరసయ్య స్ఫూర్తితో 12 ఏళ్ల వయసులోనే వ్యాపారంలో రాణించాడు. క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అయితే, ప్రస్తుతం తను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక అవడంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో శ్రమించాను. నా శ్రమకు తగిన ఫలితం లభించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో నాకు మరింతగా బాధ్యత పెరిగాయి. ఈ బాధ్యత రావడం ఆలస్యమైందని నేను అనుకోను. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. మా ఊరు నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఓ వ్యక్తి రావడం ఇదే మొదటిసారి. నా వెంటే ఉంటూ.. నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పని చేస్తాను.’’ అని ఆయన తెలిపారు.