దళపతి దూకుడు.. రూ.150 కోట్లు కొల్లగొట్టిన వారిసు

-

సంక్రాంతి కానుకగా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు. ఈ సినిమాను తమిళంలో వరిసుగా తెరకెక్కించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రష్మిక మందన్నా, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, జయసుధ, యోగి బాబు తదితరులు నటించారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.తమిళంలో ఈ సినిమా విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై ఈనెల 11న కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోకి కూడా అనువాదమైంది. తెలుగులో ఈనెల 14న, హిందీలో 13న ఈ సినిమా విడుదలైంది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

మొత్తం మీద ‘వారిసు’ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది కేవలం తమిళ వెర్షన్ కలెక్షన్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేయడం వరుసగా ఇది ఏడోసారి. ‘వారిసు’ రూ.200 కోట్లకు పైగా వసూలు చేస్తే.. ఈ ఫీట్ సాధించిన విజయ్ ఆరో సినిమా ఇది నిలుస్తుంది. తొలిరోజు రూ.47 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిన ‘వారిసు’.. 12, 13 తేదీల్లో కాస్త వెనకబడింది. కానీ, శనివారం కలెక్షన్స్ మళ్లీ పుంజుకున్నాయి. ఆదివారం కూడా ‘వారిసు’ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు రోజుల్లో రూ.70 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. మొత్తం మీద 5 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్‌ను ‘వారిసు’ వసూలు చేసింది.

 

ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 400కు పైగా థియేటర్లలో విడుదలైన ‘వారసుడు’ మూవీ రెండు రోజులలో రూ.11.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలిరోజు శనివారం రూ.5.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఆదివారం రూ.5.4 కోట్లు రాబట్టింది. ఈ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.6.04 కోట్లుగా ఉంది. మరోవైపు, హిందీలోనూ ‘వారిసు’ రాణిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.3.88 కోట్ల నెట్ వసూలు చేసింది. తొలిరోజు శుక్రవారం రూ.79 లక్షలు వసూలు చేసిన ‘వారిసు’ హిందీ వెర్షన్.. శనివారం రూ.1.55 కోట్లు, ఆదివారం రూ.1.54 కోట్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version