మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి టిడిపి నేత వర్ల రామయ్య వార్నింగ్ ఇచ్చారు. దళిత మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. మంత్రి పదవి పోయినా బాలినేనికి పొగరు తగ్గలేదని మండిపడ్డారు. బాలినేని ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఎద్దేవా చేశారు. హోం మంత్రి పదవికి తానేటి వనిత పనికిరారని… ఆమె వేరే శాఖను తీసుకోవాలని సూచించారు.
రేపల్లె అత్యాచార బాధితురాలి ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో వర్లరామయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతిభద్రతలు లేనేలేవని వర్ల రామయ్య అన్నారు. మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. శాంతిభద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ముద్దాయిల తో రాష్ట్ర ప్రభుత్వం స్నేహం గా ఉంటుందని విమర్శించారు. మూడు మానభంగాలు, ఆరు హత్యలతో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పారు.