టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా విజయసాయిరెడ్డి.. “చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందని పదేపదే చెబుతున్నాడు. అయితే, ఏపీ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. అన్ని ఆర్థిక సూచీలు అదుపులోనే ఉన్నాయి. జులై 19వ తేదీన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆర్థికశాఖల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో శ్రీలంక పరిస్థితులను ఎంపీలకు వివరించి, మనం ఎలా మద్దతు ఇవ్వాలో వివరించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక పరిస్థితులను కూడా ఆ సమావేశంలో చర్చించారు. దాంట్లో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు.
కానీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని వారు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అది మనకు కూడా వర్తిస్తుందన్నది అర్థం చేసుకోవాలి” అని అన్నారు విజయసాయిరెడ్డి. ఇక, రాష్ట్ర అప్పు, జీడీపీ నిష్పత్తి శాతాన్ని కేంద్ర శాతంతో పోల్చే ప్రయత్నం చేశారు. 2021-22వ సంవత్సరంలో కేంద్రం అప్పు-జీడీపీ నిష్పత్తి 57 శాతం అని వెల్లడించారు. అదే సమయంలో పంజాబ్ నిష్పత్తి శాతం 47గా ఉందని, ఏపీ అప్పు-జీడీపీ నిష్పత్తి శాతాన్ని చూస్తే 32.4 శాతం అని విజయసాయి వివరించారు. దీన్ని ఒక వరుసక్రమంలో తీసుకుంటే ఏపీ 5వ స్థానంలో ఉంటుందని వెల్లడించారు. ఎక్కడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితులు లేవని, ఒకరకంగా కేంద్రం కంటే మనమే చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.