శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు. 170 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు ఈఓ భ్రమరాంబ. ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీగా అంతర్గత బదిలీలకు ఉపక్రమించారు భ్రమరాంబ. వివిధ స్థాయిల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను అదే స్థానాల్లో కొనసాగిస్తున్నట్లు కొందరు ఉద్యోగుల ఆరోపించారు. 15 నుంచి 20 మందిని అదే పోస్టుల్లో కొనసాగించటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని కూడా బదిలీ చేయాలంటున్నారు మిగిలిన ఉద్యోగులు.
భ్రమరాంబ చేసిన బదిలీలపై ఉద్యోగుల్లో కలవరం ప్రారంభం అయింది. అటెండర్లు, స్వీపర్లు చేసే పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లకి విధులు కేటాయించారంటూ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జూనియర్ అసిస్టెంట్లు పనిచేసే చోటులో రికార్డ్ అసిస్టెంట్స్, అటెండర్లకు విధులు వేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో భ్రమరాంబ చేసిన బదిలీలపై దేవాదాయ కమిషనరుకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు కొందరు ఉద్యోగులు. మరి ఈవో భ్రమరాంబ దీనిపై ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి మరి.