తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం రోజు రోజుకి హీట్ పుట్టిస్తుంది. దుబ్బాకతో రాజుకున్న ఈ అగ్గి.. ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక విషయంలో రేగుతూనే ఉంది. వరుస ఎన్నికలు జరుగుతుండటంతో..ఇప్పట్లో చల్లారేలా కూడా కనిపించడం లేదు. తాజాగా సింగరేణి అంశం,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం, గులాబీ దళాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తెలంగాణలో అంశమేదైనా.. ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఏ ఒక్క చాన్స్‌నూ వదలడం లేదు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అటు, గులాబీ దళం కూడా అంతే ధీటుగా బదులిస్తూ..కమలనాథులపై కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక మొదలు.. మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ వరకు.. రెండు పార్టీల మధ్య రచ్చ నడిచింది. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక కూడా జరగనుండటంతో.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.
సింగరేణి వేదికగా జరిగిన సంకల్ప సభల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నీళ్ళు కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న సెవెన్ స్టార్ ఫామ్ హౌస్ కి వెళ్తున్నాయి తప్ప.. పేదవాడి ఇంటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో ప్రభుత్వం లేదనీ.. దోపిడిదారులే ఉన్నారనీ.. ఇది కేబినెట్ కాదు దొంగల ముఠా అనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సభలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్.. సింగరేణి సంస్థను చెప్పుచేతుల్లో పెట్టుకుని.. కోట్ల రూపాయలు కాజేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణకు సిద్దంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది కమలం పార్టీ. తెలంగాణలో వరుసగా లభిస్తున్న అనుకూల ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ నల్గొండలో గిరిజన భూముల వ్యవహారంలో అయినా, అంతకు ముందు పాతబస్తీ దేవాలయం స్థలం వివాదమైనా.. ఇటీవల లాయర్ దంపతుల హత్య విషయంలో చలో మంథని వంటి కార్యక్రమమైనా పొలిటికల్ గెయిన్ కోసమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఫలితం ఎలా ఉన్నా.. మొదట్నుంచీ బీజేపీకి ధీటుగానే బదులిస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు. ఎక్కడికక్కడ కౌంటర్ ఎటాక్‌తో కాషాయదళంపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు.. తమదంటే తమదని రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.