ఉప ఎన్నికకు ముందే మొదలైన సవాళ్ల రాజకీయం

-

నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో.. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసింది తామంటే తామే అంటూ కాంగ్రెస్, టీఆరెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాగర్ ఉప ఎన్నికల్లో వేడి పుట్టించారు.

ఒకరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత.. మరొకరు మంత్రి. ఈ ఇద్దరి మధ్యా సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. ఉపఎన్నికకు ముందే నిప్పు రాజుకుంది.మాజీ మంత్రి జానారెడ్డి , మంత్రి జగదీశ్ రెడ్డి నడుమ జరిగిన మాటకు మాట నల్గొండ రాజకీయాల్లో హీట్ పుట్టించింది.అసలు విషయానికొస్తే.. అభివృద్ధి విషయంలో సవాళ్ల పర్వాన్ని ప్రారంభించింది మాజీ మంత్రి జానారెడ్డే. ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అని.. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తాము ఏం చేశామనే విషయంపై జానారెడ్డితో చర్చకు సిద్ధమని ప్రకటించారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే జిల్లా భ్రష్టు పట్టిందని,వారి పాలన వల్లనే నల్గొండ వెనుకబడిందని ఫైర్‌ అయ్యారు. సమయం, వేదిక.. ఫిక్స్‌ చేస్తే జానారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు జగదీశ్‌ రెడ్డి. అది నాగార్జున సాగర్ లో అయినా, కోదాడ అయినా, నల్గొండ లో అయినా.. తాను రెడీ జానారెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. మంత్రి విసిరిన సవాల్‌ పై మాత్రం పెద్దాయన స్పందించలేదు.

సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని.. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు జగదీశ్ రెడ్డి. అందుకే జానారెడ్డి మాట్లాడగానే స్పందించారు. అయితే మంత్రి ప్రతిసవాల్‌తో రెచ్చగొట్టినా జానారెడ్డి మాత్రం సంయమనం పాటిస్తున్నారు. మళ్లీ రియాక్ట్‌ కావడమో.. కౌంటర్‌ అటాకో చేయడంలేదు. చర్చకు రెడీ అంటూ అగ్గిరాజేసిన పెద్దాయన తర్వాత ఎందుకు సైలెంట్‌ అయ్యారు జానా ప్యూహం వేరే ఉందా అన్న చర్చ నడుస్తుంది.

జానారెడ్డికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అంటున్నారు కాంగ్రెస్‌ అభిమానులు. ఇది మౌనం కాదు వ్యూహాత్మక ఎత్తుగడ అని అంటున్నారు. మంత్రి మాటలకు స్పందించకుండా ఉప ఎన్నికలో గెలుపుతో సమాధానం ఇవ్వాలని చూస్తున్నారట పెద్దాయన.

Read more RELATED
Recommended to you

Latest news