టి – 20 ప్రపంచ కప్ ముంగిట టీం ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కాగా, ఇప్పుడు ప్రపంచ కప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్ చాహార్ సైతం గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా తో తొలి వన్డే కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయమైనట్లు వెల్లడయింది. ఈ కారణంగానే అతను తొలి వన్డే లోనే ఆడలేదు. చివరి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు.
గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న దీపక్, ఇటీవలే టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేశాడు. ప్రపంచ కప్ కు స్టాండ్ బై గా ఎంపికైనప్పటికీ అతని జట్టుతో పాటు ఆస్ట్రేలియా కు పంపలేదు. దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ లో ఆడించాలనుకున్నారు. కానీ చీలమండ మెలిక పడడంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.
అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ కి చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా తో జరగాల్సిన మిగతా రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. సుందర్ ను జట్టులోకి తీసుకున్నట్లు శనివారం బిసీసీఐకి చెందిన ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.