నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ నేతలకు ఆహ్వానాలు అందాయి. ఆదివారం జరగనున్న ఈ వేడుకకు దేశ రాజధానిని సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ శనివారం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అంతర్జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించారని, మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని తెలిపారు.
ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆయన మాట్లాడుతూ, ఇండియా కూటమి నేతలకు ఆహ్వానాలు అందినప్పుడు ఆ వేడుకకు వెళ్లడం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ‘నైబర్ హుడ్ ఫస్ట్’ విధానానికి, ‘సాగర్’ విజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని భారత పక్కన ఉన్న దేశాల నేతలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపగా వారు కూడా ఈ వేడుకకు రానున్నట్లు తాజాగా ధృవీకరించారు. ఇదిలా ఉంటే, శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని
ఆమోదించారు.