రాష్ట్రంలో బీజేపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తే.. నాలుకలు కోస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ నాయకులకు నిజాలు చెప్పె దమ్ము లేదని అన్నారు. అందుకే అబద్ధాలను ప్రచారం చేస్తారని విమర్శించారు. అలాగే అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ సందర్శించి అపవిత్రం చేశారని ఆగ్రహించారు. దళితులపైనా, అంబేద్కర్ పైనా బీజేపీకి ఎంత ప్రేమ ఉందో దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.
మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు గోద్రా అల్లర్ల లో దళితులు ఊచకోత కి గురి అయ్యారని గుర్తు చేశారు. దళితులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీజేపీ నాయకులు అంబేద్కర్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే రాజ్యాంగం విషయంలో బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అంబేద్కర్ నే చెప్పారని గుర్తు చేశారు.