నైరుతి రుతుపవనాల పురోగమితి సాధారణంగా కొనసాగుతోంది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 31 నుంచి జూన్ 7వ తేదీ వరకు దక్షిణ, మధ్య అరేబియా సముద్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ అధికారిణి ఆర్‌కే.జేనామణి తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రకు తాకుతాయని అన్నారు. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశంలో భారీ వర్షం కురుస్తుందని అన్నారు.
నైరుతి రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదని జేనామణి అన్నారు. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ సారి నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో బలమైన గాలులు వీయడం, దట్టంగా మేఘాలు కమ్ముకోవడం కనిపిస్తాయని అన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రపద్రేశ్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.