చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు పాపాలు చేస్తే నరకానికి పోతారు. పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారు. నరకంలో అనేక శిక్షలు వేస్తారు. నూనెలో వేసి వేయించడాలు, జంతువులున్న చోట వదిలేయడాలు వంటివి ఉంటాయని చెబుతుండేవారు. అదంతా అప్పట్లో నిజమేనేమో అనిపించేది. పెరుగుతున్న కొద్దీ, అవి కథలుగా మిగిలిపోయాయి. ఐతే మరణించిన తర్వాత ఏమవుతుందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఉంటుందా? ఆత్మ ఏం చేస్తుంది అనే విషయాలు ఆసక్తిగా ఉంటాయి.
మరణించిన తర్వాత మనిషి ఆత్మ ఏమవుతుందనే విషయం గురించి గరుడ పురాణంలో ఏం ఉందో ఒక్కసారి తెలుసుకుందాం.
అందులో చెప్పిన దాని ప్రకారం, మరణించాక ఆత్మ నరకలోకానికి వెళ్తుందట. సినిమాల్లో చూపించినట్టుగానే యమదూతలు తీసుకువెళతారట. ఐతే మనిషి ఆత్మ యమలోకంలో కేవలం 24గంటలే మాత్రమే ఉంటుందట. ఈ 24గంటల్లో భూమి మీద శవానికి దహన సంస్కారాలు పూర్తవుతాయి. ఈ దహన సంస్కారాలు ఫూర్తయ్యే సమయంలో యమలోకంలో ఉన్న ఆత్మకి, మనిషిగా ఉన్నప్పుడు చేసిన మంచి, చెడు పనులు చూపిస్తారట.
ఒక్కసారి దహన సంస్కారాలు ఫూర్తికాగానే మరలా ఆత్మని వాళ్ళింట్లో ప్రవేశ పెడతారట. అలా పదమూడు రోజుల పాటు ఆత్మ ఇంట్లోనే ఉంటుందట. కర్మలు పూర్తయ్యాక మరలా మళ్లీ యమలోకానికి తీసుకొస్తారట. అలా తీసుకొచ్చే దారిలో దేవ లోకం, పితృలోకం, యమలోకం మూడూ ఉంటాయట. మనిషి చేసిన పాప పుణ్యాలని బట్టి అతన్ని ఏ లోకంలో వేయాలనేది నిర్ణయం తీసుకుంటారట. గరుడ పురాణంలో రాసి ఉన్న దీన్ని చాలా మంది నమ్మవచ్చు, లేదా నమ్మకపోవచ్చు.
కానీ మనిషి చనిపోయాక అతని ఆత్మ (ఒకవేళ ఉంటే) ఏమవుతుందనే విషయం అందరికీ ఆసక్తి కలిగించే అంశమే. ఇక్కడ ఒక ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఆత్మ ఉందని నమ్మితే, భూమ్మీద కనుమరుగైపోయిన వారు ఎక్కడో ఓ చోట ఉండే ఉంటాడని ఫీలవడం చాలా మందికి సంతృప్తిని ఇస్తుంది.