ఎవరీ ద్రౌపదీ ముర్మూ..? ఈమె గెలుపు కొత్తరికార్డే

-

ద్రౌపదీ ముర్మూ..మంగళవారం సాయంత్రం నుంచి ఈ పేరు తెగ హల్‌ చల్‌ చేస్తుంది. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ద్రౌపదీ ముర్మూ పేరు ప్రకటించారు. నిన్న రాత్రి జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమితా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, 20 అభ్యర్థుల పేర్లపై చర్చించి.. చివరకు ఆమెను ఖరారు చేశారు. ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చింది కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారు. మరీ కాబోయే రాష్ట్రపతిగా భాజపా ఈమెను తెరపైకి తీసుకొచ్చారాంటే.. సామాన్యురాలైతే ఉండదుగా..! ద్రౌపదీ ముర్మూ ఎవరూ, గతంలో ఏం చేసారు. ముర్మూ రాజకీయ ప్రస్థానం ఏంటి.? ఈ వివరాలన్నీ మీ కోసం..!

ఈమె గెలుపు కొత్తరికార్డే సృష్టిస్తుంది..

సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భాజపా నాయకత్వం ముర్మూ పేరు ఖరారు చేశారు. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బైడా పోసి గ్రామంలో ముర్మూ జన్మించారు.. ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో భాజపా, బీజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు.

ఎలక్టోరల్ కాలేజిలో ఎన్డీయేకి 58% ఓట్లు ఉన్నందువల్ల ముర్మూ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పక్షం భావిస్తోంది. ముర్మూ నెగ్గితే రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు ఆమే నిలుస్తారు. అవుతారు. ఆమె పేరును ప్రకటించే ముందు భాజపా ఒడిశా ముఖ్యమంత్రిని సంప్రదించింది.

 

ముర్మూ వ్యక్తిగత వివరాలు…

ద్రౌపదీ ముర్మూ (64) ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు.

ద్రౌపదీ ముర్మూ భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త, ఇద్దరు కుమారులు చనిపోయారు.

బీఏ రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్లో చేశారు. నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ (1979-1983) గౌరవ అసిస్టెంట్ టీచర్, శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్, రాయ్ రంగాపూర్‌ (1994-1997)

రాజకీయ ప్రస్థానం..

బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు.1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము.. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలపాటు ఎమ్మెల్యేగా గెలుపొందారు

ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ – బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6 2000 నుంచి ఆగష్టు 6 2002 వరకూ వాణిజ్య రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

2004లో మళ్లీ రాయ్‌రంగాపూర్‌లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2002-2009: మయూర్ భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలు

2006-2009 వరకూ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా కూడా చేశారు.

2013-2015: మయూర్ భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలు

2015: ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా నియామకం. 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపదీ ముర్మూ చరిత్ర లిఖించనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించిన అనంతరం బీజేపీ అనూహ్యంగా గిరిజన నాయకురాలు ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. జూన్ 21న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news