ఉద్దాన తీరాల్లో జనసేన హవా తగ్గిందా? అసలు పవన్ ఎందుకని శ్రీకాకుళం రాజకీయాల వైపు ఆసక్తి చూపడం లేదు? ఈ రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం ఈ కథనం. ఉద్దాన తీరాలపై ఒకప్పుడు పవన్ మంచి శ్రద్ధ ఉంచేవారు.ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితుల తరఫున ఆయన పోరాడారు.తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీశారు.వాళ్లకు పింఛను దక్కేలా, వైజాగ్ కు పోయి డయాలసిస్ చేయించుకునేందుకు ఉచిత బస్ పాస్ సౌకర్యం దక్కేలా ఆయన కృషి చేశారు.
అదేవిధంగా ఉద్దానంకు చెందిన సోంపేట, కంచిలి,కవిటి,పలాస, మందస తదితర ప్రాంతాల్లో ఆర్ ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి, శుద్ధ జలాల పంపిణీకి ప్రభుత్వం కృషి చేసేలా కూడా పనిచేయగలిగారు. కానీ ఆయన అనుకున్నంతగా ఫలితాలు సాధించలేకపోయారు.ఎన్నికల వేళ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో అక్కడ జనసేన అభ్యర్థులు చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. దీంతో పవన్ కూడా చాలా నిరాశకు గురయ్యారు. సమస్య వస్తే తన దగ్గరకు రావడంలో తప్పేమీ లేదని కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తనను వాడుకుని వదిలేయడం ప్రజలకు తగదని కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం నెలకొనాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాల్లో పవన్ మాట చెల్లాలంటే ఇక్కడి నుంచి ఆయనే పోటీ చేయాలి.ఇచ్ఛాపురం నుంచి కానీ పలాస నుంచి కానీ పోటీ చేయాలి.ఒకవేళ టీడీపీతో పోటీ ఉన్నా కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఈ రెండు నియోజక వర్గాలలో ఏదో ఒకటి పవన్ కు కేటాయించాలి. అప్పుడు పవన్ ను గెలిపించే బాధ్యతను కూడా చంద్రబాబు తీసుకోవాలి. అలా చేస్తేనే పొత్తు ధర్మంలో చంద్రబాబు సమన్యాయం పాటించిన వారు అవుతారు.ఆ విధంగా జనసేన గెలుపునకు టీడీపీ కృషి చేస్తేనే ఉద్దాన తీరాల్లో పవన్ గెలుపు తథ్యం అవుతుంది.లేదంటే లేదు.