బాబుకు కొత్త టెన్షన్: ఆదిరెడ్డి భవానీ రాపాకను ఫాలోఅవుతున్నారా?

-

ఏపీ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద “1” అని నెంబర్ వేయకుండా కొందరు టీడీపీ నేతలు టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, చీరాల శాసన సభ్యుడు కరణం బలరాం ఈ చెల్లని ఓట్లు వేసినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. అది ఆల్ రెడీ ఊహించిన విషయమే కావడంతో.. పెద్దగా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే వారి తెలివితేటలకు వైకాపా నేతలు ముచ్చట పడ్డారు. బాబు విప్ జారీ చేస్తే దానికి ఈ ముగ్గురు రెబల్సూ ఇలా బాబుకు ఇలా రివర్స్ షాక్ ఇచ్చారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు!

ఈ క్రమంలో నాలుగో నేత ఎవరబ్బా అని అంతా ఆసక్తిగా ఎదురుచూసిన క్రమంలో… మరో నేత కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే అని.. ఆ పేరు ఆదిరెడ్డి భవాని అని తెలిసింది. పై మూడు పేర్లూ అంతా ఊహించినవే కానీ.. నాలుగో పేరు మాత్రం ఎవ్వరూ ఊహించకపోయే సరికి.. రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. దీంతో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఆదిరెడ్డి భవానీ ఫాలో అవుతున్నారా అనే అనుమానాలూ రేకెత్తాయి. ఇందుకు గల బలమైన కారణం… ఏపీ లో తొలి ఎమ్యెల్సీ గా వైఎస్ జగన్ గతంలో ఎంపిక చేసింది ఆదిరెడ్డి అప్పారావును! ఆయన ఆదిరెడ్డి భవాని కి స్వయంగా మామ కాగా.. ఈయనకు అటు టిడిపి, ఇటు వైసిపి లో కూడా సత్సంబంధాలే ఉన్నాయి!

దీర్ఘ కాలంగా విపక్ష పాత్ర పోషించడంతో ఈ ఆదిరెడ్డి కుటుంబానికి డబ్బుకు డబ్బు పోయి, అధికారపార్టీలో లేకపోవడంతో నియోజకవర్గంలో గౌరవం కూడా తగ్గిందట. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఆఫర్ ను అందుకుని మరోసారి పార్టీ మారడమా లేక జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ లా విపక్ష పార్టీలో ఉంటూనే అధికారపార్టీకి కొన్ని విషయాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని విషయాల్లో పరోక్షంగా సహకరించడమా.. ఇలా రెండు రకాల అప్షన్ లు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఊరిస్తున్నాయని అంటున్నారు. దీనికి తోడు ఇటీవలే అచ్చన్నాయుడు అరెస్ట్ తో జగన్ కి ఎదురు నిలిచి పోరాడితే కేసులు తప్ప మరేమి ఒరిగేదేమి లేదని టిడిపి లో మరో చర్చ నడుస్తున్న క్రమంలో… భవానీ కావాలనే ఇలా చేశారని అంటున్నారు!!

అయితే… ఈ విషయాలపై స్పందించిన భవానీ… ఓటింగ్ సమయంలో అక్కడ ఉండే వ్యక్తి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో వ‌చ్చిన‌ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరపాటు జరిగిందని ఆమె వెల్ల‌డించారు! ఇది వినడానికి బాగానే ఉన్నా నమ్మశక్యంగా మాత్రం అనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news