కేదార్ నాథ్ ధామ్ అంటే శివుడు పుణ్యక్షేత్రం.. పవిత్రమైన ప్రదేశం. అందులోనూ గర్భ గుడిలో కొలువైన శివయ్య దగ్గరకు వెళ్లేటప్పుడు ఎంతో భక్తితో వెళతారు భక్తులు. అలాంటి గర్భ గుడిలోని.. శివుడి.. శివ లింగంపై ఓ మహిళ తన దగ్గర ఉన్న డబ్బును వెదజల్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే ఆమె ఎవరో తెలియరాలేదు.
ఈ వీడియోను పరిశీలించగా శివలింగానికి పక్కన కుడివైపున నిలబడిన మహిళ కేదారేశ్వరుడిపై నోట్లు వెదజల్లుతోంది. అదే సమయంలో పురోహితులు మంత్రాలు పఠిస్తున్నారు. ఈ గుడిలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం. పైగా ఆమె కరెన్సీ నోట్లు చల్లుతుంటే ఎవరూ వారించలేదు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయంలో ఆమె ప్రవర్తనపై, ఆలయ సిబ్బంది, అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బద్రీనాథ్ – కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ చెప్పారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.