గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తున్నారని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి విమర్శించారు మంత్రి పువ్వాడ అజయ్. దేశంలో మతం, కులం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ బిఆర్ఎస్ వైపు చూస్తున్నాయన్నారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ కీలకంగా మారతారని అన్నారు పువ్వాడ అజయ్. దేశానికి కావలసింది దేశాన్ని అమ్మే ప్రధాని కాదని.. దేశ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని అన్నారు.
గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. రైతు రాజు అయ్యే రోజులు కేసీఆర్ తోనే సాధ్యమవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని.. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ సంకల్పంతో యావత్ దేశ నలుమూలలా దేశ ప్రజలకు కోతలు లేని కరెంటు కచ్చితంగా అంది తీరుతుంది అన్నారు.