అమరావతి ఎఫెక్ట్ నుంచి బయట పడేందుకు…అమరావతిని వికేంద్రీకరణ చేశారని గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పార్టీపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం నుంచే జగన్‌తో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ వర్గంలో కూడా కొందరు నేతలు టీడీపీపై వ్యతిరేకతతో వైసీపీని గెలిపించారు. అందుకే రాజధాని ప్రాంతం ఉన్న పొన్నూరు, తాడికొండతో పాటు చంద్రబాబు తనయుడు లోకేష్ స్వయంగా పోటీ చేసిన మంగళగిరిలో సైతం వైసీపీ విజయం సాధించింది.
ఇక ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లోనే కాకుండా అమరావతిని వైజాగ్, కర్నూలుకు వికేంద్రీకరణ చేయడంతో ఆ ఎఫెక్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని వర్గాలపై గట్టిగానే పడిందన్న నివేదికలు జగన్‌కు అందాయి. ఇక కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ అణగదొక్కేస్తున్నారన్న టాక్ కూడా ఎక్కువుగా వినిపిస్తోంది. ఇక గత ఎన్నికలకు ముందు కమ్మ వర్గానికి చెందిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు సీటు ఇవ్వని జగన్ ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు.
ఇక పొన్నూరు సీటు ఇవ్వని మరో కమ్మ నేత రావి వెంకటరమణకు సైతం ప్రయార్టీ లేదు. ఈ క్రమంలోనే ఈ కమ్మ నేతలకు కీలకమైన పదవులు కట్టబెట్టడంతో పాటు ఈ వర్గం నేతల్లో అసంతృప్తికి చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వచ్చిన కమ్మ నేతలకు మరిన్ని పదవులు ఇవ్వడంతో పాటు టీడీపీలో ఉన్న మరి కొంత మంది కమ్మ నేతలను కూడా పార్టీలో చేర్చుకునేలా ఆపరేషన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ఇక జగన్ ప్రయార్టీ ఇవ్వాలనుకుంటోన్న కమ్మ నేతల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్‌తో పాటు విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ ఉన్నారట. వీరిలో అవినాష్ ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి..పార్టీ మారి ఇప్పుడు తూర్పు ఇన్‌చార్జ్ అయ్యారు. అవినాష్‌కు త్వరలోనే విజయవాడ నగర పార్టీ పగ్గాలు అప్పగించనున్నారట. ఇక మర్రి రాజశేఖర్‌కు గుంటూరు ప్రాంతీయాభివృద్ధి మండలి చైర్మన్‌తో పాటు కేబినెట్ హోదా కట్టబెట్టనున్నారట. రేపటి రోజు వీళ్లనే తిరిగి టీడీపీని టార్గెట్ చేసేందుకు జగన్ వాడుకుంటారని టాక్..?