తెలంగాణ గవర్నర్ తమిళసైకి లేఖ రాశారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. టీఎస్పీఎస్సీ బోర్డు ప్రశ్నాపత్రాలు అమ్ముకొని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని.. ఇంత పెద్ద స్కాం బయటపడిన ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండానే మళ్లీ పరీక్షలు నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు ఆర్టికల్ 317 ప్రకారం విచక్షణాధికారులను ఉపయోగించి టిఎస్పిఎస్సి బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త టీఎస్పీఎస్సీ బోర్డును ఏర్పాటు చేయించి.. పారదర్శకంగా నియామకాలు జరిపించి, నిరుద్యోగులకు అండగా నిలబడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు షర్మిల.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని.. అందుకే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరించడం లేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు వెనుకాడిన పక్షంలో రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకునే బాధ్యత గవర్నర్ పై ఉందని గుర్తు చేశారు. 30 లక్షల మంది జీవితాలు గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయన్నారు షర్మిల.