కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందులో భాగంగానే అనేక మంది నిత్యం రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను, మూలికలను తీసుకుంటున్నారు. అయితే ఆ జాబితాలో తాజాగా డార్క్ చాకొలెట్, గ్రీన్ టీ, ముస్కాడిన్ ద్రాక్షలు వచ్చి చేరాయి. ఇవి కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పలు వృక్ష ఆధారిత సమ్మేళనాలపై ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలోనే వారు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, ముస్కాడిన్ ద్రాక్షల్లోని సమ్మేళనాలపై కూడా పరిశోధనలు చేశారు. దీంతో వాటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటాయని గుర్తించారు. కరోనా వైరస్ సహజంగానే మన శరరీంలో చేరాక తన సంఖ్యను వృద్ధి చేసుకుంటుంది. అయితే ముందు చెప్పిన పదార్థాల్లో ఉండే వృక్ష ఆధారిత సమ్మేళనాలు కరోనా వైరస్ ను వృద్ది చెందకుండా అడ్డుకుంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
ఇక సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధనలకు చెందిన వివరీలను ఫ్రాంటియర్స్ ఇన్ ప్లాంట్ సైన్స్ అనే జర్నల్ లోనూ ప్రచురించారు. సదరు పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై వారు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు.