ఇక సోషల్‌ మీడియాలో ప్రచారాలు చేయడం అంత ఈజీ కాదు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే..!!

సోషల్‌ మీడియాలో కాస్తంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే చాలు..బయోలో రాసేసుకుంటారు..డీఎం ఫర్‌ పెయిడ్‌ ప్రమోషన్స్‌ అని.. సోషల్‌ మీడియా కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్‌ అయితే.. చాలామందికి వ్యాపారం అయిపోయింది. ఏదో ఒక జోనర్‌లో కొన్నిరోజులు వీడియోలు చేయడం.. క్లిక్‌ అయి ఫాలోవర్స్‌ పెరిగితే.. ప్రమోషన్స్‌ ఇచ్చేయడం.. ఒక్కోసారి వీళ్లు అసలు వాడే చెప్తున్నారా..లేక డబ్బులు కోసం చెప్తున్నారా అనిపిస్తుంది.. అమాయకపు ప్రజలు..అప్పటికే వాళ్లను ఫాలోఅవుతారు, వారిమీద ఇష్టం పెంచుకుంటారు., వాళ్లు చెప్పేది నిజమే అనుకోని వాటిని కొనేస్తారు..నిజమే అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ ద్వారా ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంతో పాటు కొందరు తప్పుదారి పట్టిస్తారు కూడా. అయితే అలా తప్పుదారి పట్టించడం ఇప్పుడు చట్టరీత్యా నేరం కానుంది. పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా మంచి మాధ్యమం. 2020లో సోషల్ మీడియా రూ.1,275 కోట్ల పెద్ద మార్కెట్‌గా ఉంది. 2025 నాటికి ఇది 20 శాతం పెరిగే అవకాశం ఉంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇప్పుడు సెలబ్రిటీలు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైనా సరే.. ఉత్పత్తులను సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా ప్రచారం చేయలేరు. అయితే దీని కోసం వారు కొంత ముఖ్యమైన సమాచారాన్ని జోడించాల్సిందే..

కొత్త రూల్స్‌ ఇవే..

కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ, ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ ప్రమోషన్ కోసం డబ్బు తీసుకున్నారా లేదా అని చెప్పాలి. ఈ సమాచారంతో పాటు వారి ఆర్థిక ప్రయోజనం ప్రచారం వెనుక ఉందని కూడా తెలపాలి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సరైన సమాచారం వినియోగదారునికి చేరాలనే ఉద్దేశ్యంతో ఈ మార్గదర్శకాన్ని తీసుకువచ్చినట్లు డిపార్ట్‌మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు..
ఇప్పుడు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రొడక్ట్ ఎండార్స్‌మెంట్ కోసం డబ్బు అందుకున్నారా లేదా అని చెప్పాలి. ప్రభావితం చేసే వ్యక్తులు ఈ సమాచారాన్ని వీడియోలోనే ఇవ్వాలి. అలాగే వారు ఆ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారా లేదా అని కూడా చెప్పాలి.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మార్గదర్శకం ప్రత్యక్ష ప్రసారానికి కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో లైవ్ స్ట్రీమ్ ద్వారా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తే, ఇందులో కూడా వారు ఉత్పత్తి గురించి సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిందే..

లైట్‌ తీసుకుంటే లక్షల్లో ఫైన్..

ఎవరైనా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే ఈ జరిమానా రూ.50 లక్షలకు పెరుగుతుందని హెచ్చరించింది… అలాగే.. ఏ ఉత్పత్తులనూ ప్రచారం చేయకుండా ఆరు సంవత్సరాల పాటు నిషేధం విధించనున్నారు.
మొత్తానికి ఇది మంచి నిర్ణయమే. మీరు గమనించే ఉంటారు.. ఈ మధ్య సోషల్‌ మీడియోలో ప్రమోషన్స్‌ బ్యాచ్‌ ఎక్కువైపోయింది..! ఏదో టైమ్‌పాస్‌ కోసం అలా ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే..అన్నీ ఇవేనాయే..! మీకు ఇదే అభిప్రాయం ఉందా..?