చాలా మందికి వాళ్ల రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలపైనే సరిగ్గా అవగాహన ఉండదు. ఇక కేంద్రప్రభుత్వం అందించే పథకాల గురించి ఎలా తెలుస్తుంది. నిజానికి కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్స్ రూపొందించబడ్డాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు చెప్పుకోబోయే స్కీమ్ కూడా ఒకటి. భార్యాభర్తలు ప్రతీ నెలా రూ.41,000 పొందే అవకాశం ఈ స్కీమ్‌తో లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme). ఇటీవల వడ్డీ రేట్లు పెరగడం, బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేయడంతో ఇందులో డబ్బులు దాచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచింది. పెరిగిన లిమిట్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును కూడా పెంచింది. దీంతో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కూడా ఇదే వడ్డీ లభిస్తోంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ బెనిఫిట్స్
కేంద్ర ప్రభుత్వం 2004లో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుల్ని ఈ పథకంలో పొదుపు చేసి ప్రతీ నెలా వడ్డీ పొందొంచ్చు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువగా వస్తుంది. అందుకే ఈ పథకంలో డబ్బులు దాచుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పథకంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.41,000 వరకు తమ అకౌంట్‌లోకి పొందొచ్చట..
ఉదాహరణకు ఈ పథకంలో ఒకరు రూ.30 లక్షలు పొదుపు చేసే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు జమ చేశారని అనుకుందాం. వారికి ఏటా రూ.4,92,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.41,000 వడ్డీ వస్తుంది.