భారత ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బాయ్ కాట్ మాల్ద్వీస్ అనే అంశం ట్రెండ్ అవుతుంది. ఈ సమయంలో లక్షద్వీప్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షద్వీప్‌కి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది, పర్మిషన్ ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి చాలా మంది సర్చ్ చేస్తున్నారు. భారతదేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాల మాదిరిగా లక్షద్వీప్‌కు నేరుగా వెళ్లలేరు. ఎందుకంటే లక్షద్వీప్ వెళ్లాలంటే పర్మిషన్ లెటర్ తప్పనిసరి. అయితే ఇది పొందడం అంత కష్టమైన పనేంకాదు.
లక్షద్వీప్‌కు ఎలా వెళ్లాలి?: భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌కు వెళ్లడానికి రోడ్డు, రైలు మార్గాలు లేవు. అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. అందువల్ల ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడ నుంచి విమానాలు, ఓడల ద్వారా లక్షద్వీప్ చేరుకోవచ్చు.
కొచ్చికి విమాన మార్గం: ఇక కొచ్చీకి చేరుకోవడానికి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి ప్రతిరోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. రోడ్డు, రైల్ ఆప్షన్ కూడా ఉండనే ఉంది. కొచ్చికి వెళ్లడానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 4,500 ఉంటుంది. ఇదే సమయంలో కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి వెళ్లడానికి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 5,500 ఉంటుంది.
కొచ్చికి రైలు మార్గం: లక్షద్వీప్ వెళ్లడంకోసం ముందుగా కొచ్చికి ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే… హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్‌కు రోజూ శబరి ఎక్స్ ప్రెస్ (17230) నడుస్తుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణ సమయం 23:35 గంటలు పడుతుంది. అంటే సుమారు ఒక రోజు. ఇక విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉండగా… విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అలప్పీ-బొకారో ఎక్స్ ప్రెస్ రోజూ వైజాగ్ నుంచి కేరళకు వెళ్తుంది.
కొచ్చికి రోడ్డు మార్గం: ఇక రోడ్డు మార్గంలో కేరళలోని కొచ్చి పట్టణాన్ని చేరుకోవడానికి పొరుగు రాష్ట్రాలతో నేషనల్ హైవేలు అనుసంధానిస్తుంటాయి. ఇందులో భాగంగా ముంబయి, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ సాగే నేషనల్ హైవేపైనే కొచ్చీ ఉంది. ఈ నగరాల నుంచి అక్కడికి రోడ్డు మార్గాన వెళ్లొచ్చు.
కొచ్చి నుంచి లక్షద్వీప్:
ఎలాగోలా కొచ్చికి చేరుకుంటాం… ఇక అక్కడి నుంచి లక్షద్వీప్‌కు ప్రయాణం మొదలవుతుంది.. కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు బోట్లు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు ఉంటాయి. పైన చెప్పుకున్నట్లుగా లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి సరిగ్గా 1:30 గంటల సమయం పడుతుంది. ఇక జల మార్గం విషయానికొస్తే… కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు సుమారు 7 ఓడలు అందుబాటులో ఉంటాయి. వీటిద్వారా ప్రయాణ సమయం సుమారు 14 నుంచి 18 గంటలు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ అనే కేటగిరీలు ఉంటాయి. ఓడను బట్టి క్లాస్‌లను బట్టి టిక్కెట్ ధరలు రెండున్నర వేల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి.
లక్షద్వీప్‌కి ఎప్పుడు వెళ్లాలి?: సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం లక్షద్వీప్‌కు వెళ్లడానికి ఉత్తమ సమయం అని అంటారు. ఇక్కడ టెంపరేచర్ 22 – 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వాస్తవానికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
లక్షద్వీప్ పర్యటనకు ఎంత ఖర్చవుతుంది?: లక్షద్వీప్‌లో పర్యటించేందుకు వ్యక్తిగతంగా వెళ్లేకంటే టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా వెళ్లడమే బెటర్ అని పలువురు పర్యాటకులు అంటున్నారు. ఇందుకోసం వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 6 రోజులకు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి. ఈ ప్యాకేజీ కోచి నుంచి మొదలవుతుంది. ఉదాహరణకు 3 రోజుల ప్యాకేజ్ తీసుకుంటే… ఒక రాత్రి కోచిలో, రెండు రోజులు లక్షద్వీప్‌లో బస కల్పిస్తారు. మూడు రోజుల ప్యాకేజీ ఒక్కో వ్యక్తికి రూ. 23,000 నుంచి మొదలవువుతుంది. ఇందులో హోటల్ గదులతో పాటు, సైట్ విజిటింగ్, లోకల్ ట్రాన్స్ పోర్టు, ఆహారం కల్పిస్తారు. కోచికి చేరుకోవడానికి మాత్రం ఖర్చులను వ్యక్తిగతంగా భరించాలి.
పర్మిషన్ పొందడం ఎలా?:
ఆన్‌లైన్‌లో అనుమతి లేఖను పొందడానికి రెండు మార్గాలు
లక్షద్వీప్ అనుమతి లేఖను ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందడం సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఇ-పర్మిట్ పోర్టల్ ద్వారా లాగిన్ చేసి, కొన్ని పత్రాలను సమర్పించడం ద్వారా మీరు సులభంగా అనుమతిని పొందవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి నమోదు చేసుకుంటే అనుమతి లేఖ వస్తుంది. మీ ప్రయాణానికి 15 రోజుల ముందు అనుమతి లేఖ ఇమెయిల్ ద్వారా మీకు చేరుతుంది. దీని కోసం ఈ పోర్టల్‌పై క్లిక్ చేసి నమోదు చేసుకోండి (https://epermit.utl.gov.in/pages/signup)
ఆఫ్‌లైన్: దరఖాస్తును లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా కరావతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి దరఖాస్తు పొందాలి. పేరు, చిరునామా మరియు ఇతర సమాచారాన్ని పూరించండి. కొన్ని పత్రాలను జతచేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వండి. ఈ పద్ధతి కొంత సమయం పడుతుంది. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ http://www.lakshadweeptourism.com/contact.html క్లిక్ చేయండి.
అనుమతి పొందడానికి అవసరమైన పత్రాల వివరాలు:
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అధికారిక గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డ్)
ప్రయాణ పత్రం (విమాన టిక్కెట్ లేదా పడవ టిక్కెట్)
హోటల్ బుకింగ్ రికార్డు
అనుమతి పొందడానికి నిర్ణీత రుసుము చెల్లించాలి. విదేశీయులకు మరియు భారతీయులకు ప్రత్యేక ఫీజు విధానం ఉంది. ఇప్పుడు పర్మిషన్ లెటర్ లక్షద్వీప్‌లో 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పర్మిట్ హోల్డర్లు లక్షద్వీప్‌లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే ఉండగలరు. లక్షద్వీప్‌లో 30 రోజులకు మించి ఉండటానికి తగిన కారణాలు మరియు పత్రాలను అందించాలి. కొన్ని ప్రత్యేక మరియు అత్యవసర సందర్భాలలో మాత్రమే అదనపు రోజు బస అనుమతించబడుతుంది.