రాజీ డ్రామాలేనా..స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కిస్తారా

-

తెలుగువాడి సుధీర్ఘ పోరాట సాధన విశాఖ స్టీల్ ప్లాంట్‌. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. నిజానికి ఈ ప్రతిపాదన కొత్తదేం కాదు. చాలా రోజుల నుంచే నలుగుతోంది. అన్నీ పార్టీలకు ఈ విషయం తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో స్పెషల్‌ స్టేటస్‌ విషయంలోనూ ఎలా అయితే ఏమీ తెలియనట్లు నటించాయో ఇప్పుడు కూడా పార్టీలు అదే చేస్తున్నాయి. మళ్లీ మోసం చేస్తున్నాయి.కొందరు రాజీనామాల డ్రామా ఆడుతుంటే… ఇంకొందరు తెలివిగా తప్పించుకుంటున్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చాలా మంది ఏడాది క్రితమే హెచ్చరించారు. అయినా అప్పుడు నోరెత్తకుండా పార్టీలన్నీ ఏమీ తెలియనట్లు నటించాయి. ఇప్పుడు ప్రైవేటీకరణ కసరత్తు ప్రారంభం కాగానే… లబోదిబోమంటూ నేతలు గొంతు చించుకుంటున్నారు. ఈ రేసులో అందరి కంటే ముందున్నది… టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా. ఏకంగా రాజీనామా లేఖ గీసి పంపేసారు. తీరా చూస్తే అది స్పీకర్‌ ఫార్మెట్‌లో లేదు. వైసీపీ నేతలు కూడా డ్రామా విషయంలో తామూ ఏ మాత్రం తక్కువ తినలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి ఓ కార్యాచరణ అంటూ ప్రకటించకుండా… అవసరమైతే రాజీనామాలు చేస్తాం… ఇంకా అవసరమైతే ప్రాణత్యాగాలు చేస్తామంటూ డైలాగులు పేల్చుతున్నారు.

ఇక బీజేపీ కూడా ఇదే డ్రామా కొనసాగిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం ఎవరి వల్లా కాదని… అంతా అయిపోయిందని స్పష్టంగా చెప్పేశారు ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి. కానీ బీజేపీ నేతలు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటీకరణను తమ వంతు కృషి చేస్తామని కొందరు చెబుతుంటే… పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు బీజేపీ వ్యతిరేకం కాదని… స్టీల్‌ ప్లాంట్‌కు కూడా ఏది మంచిదో అది చేస్తామని మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

సీఎం జగన్ తన వంతు బాధ్యతగా మోడీకి లేఖ రాస్తే… చంద్రబాబు మాత్రం స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా కనీసం ఓ ట్వీట్‌ కూడా చేయలేదు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందంటూ… భారం మొత్తం సీఎం పైనే వేసి చేతులు దులుపుకున్నారు… ప్రతిపక్షనేత. వాజ్‌పేయి హయాంలో ఇలాంటి పరిస్థితే వస్తే… టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉక్కు కర్మాగారాన్న కాపాడిందని గుర్తు చేశారే తప్ప… ఇప్పుడేం చేద్దామన్న దానిపై కార్యాచరణ మాత్రం ప్రకటించ లేదు… చంద్రబాబు.

ఇక ఇటీవలే బీజేపీ మిత్రపక్షంగా మారిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అయితే మరీ దారుణం. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం… వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామనే జనసేనాని… ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారో… ఆయన పార్టీ శ్రేణులకు కూడా అర్థం కావడం లేదు.

ఇప్పటికైనా నాయకులు, పార్టీలు డ్రామాలు ఆపి… అందరూ ఒక్కటై కదలకపోతే మరోసారి ఏపీకి దారుణ మోసం తప్పదు. తమిళనాడుకే కనుక ఇలాంటి ప్రతిపాదన వస్తే ఏం జరుగుతుందో… అక్కడి వాళ్లు ఎలా రియాక్ట్‌ అవుతారో మన పార్టీల లీడర్లు ఒక్కసారి ఆలోచిస్తే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news