టీడీపీకి ఏపీఎస్‌ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఒంగోలులో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తామని, బస్సులు అద్దెకు ఇవ్వాలని కోరితే.. అధికారులు ముఖం చాటేస్తున్నారు. అధికారులు ముందు సరే అన్నారని, తర్వాత కుదరదన్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెబుతున్నట్లు, మరోవైపు మంత్రులు ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్న సభలకు జనాలను తరలించేందుకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు సమకూర్చేలా రవాణాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు.
మంత్రుల బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 26న శ్రీకాకుళం, 27న రాజమహేంద్రవరం, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దీని కోసం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను పెద్ద సంఖ్యలో సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్నెన్ని బస్సులు సమకూర్చాలనేది అక్కడి అధికారపార్టీ నేతలు, రవాణాశాఖ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.