గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నిన్నటి మాదిరిగానే ముసురు పట్టివీడనంటోంది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.
వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, రాబోయే 24 గంటల్లో నగరంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనానికి తోడు షియర్ జోన్ ఏర్పడటం, రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు గ్రేటర్‌కు ఇప్పటికే రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎలాంటి సమస్య ఎదురైనా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111ను సంప్రదించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు అధికారులు.