టిట్ ఫర్ టాట్: కేసీఆర్ కనికట్టు…కమలం క్లారిటీ?

-

రాజకీయాల్లో కేసీఆర్ చేసే జిమ్మిక్కులు మామూలుగా ఉండవు…ప్రత్యర్ధులని చిత్తు చేయడానికి ఆయన ఎప్పుడు ఏ విధమైన వ్యూహాలతో వస్తారో ఎవరికి క్లారిటీ ఉండదు. అలాగే తాము చేసే తప్పులని కనబడనివ్వకుండా ప్రత్యర్ధుల మిస్టేక్ లని హైలైట్ చేసి రాజకీయంగా బెనిఫిట్ పొందడంలో కేసీఆర్ ని మించిన వారు లేరు. ఎప్పుడైతే తమపై వ్యతిరేకత పెరిగిపోతుందని డౌట్ వస్తుందో అప్పుడే ఆ వ్యతిరేకతని ప్రత్యర్ధుల మీదకు తోసేయడానికి చూస్తారు.

ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తూ వస్తున్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్…తెలంగాణకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. అలాగే హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయలేదనేది కూడా ఉంది. అటు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ప్రజా వ్యతిరేకత ఊహించని విధంగా పెరుగుతుంది…ఇక ప్రతిపక్ష పార్టీల బలం కూడా పెరుగుతూ వస్తుంది…ముఖ్యంగా బీజేపీ బలం పెరుగుతుంది.

దీంతో కేసీఆర్ స్ట్రాటజీ మార్చేశారు..తమ తప్పులని కనబడనివ్వకుండా కేంద్రాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు…కేంద్రం అంటే ఆటోమేటిక్ గా బీజేపీని టార్గెట్. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కూడా పెరుగుతుంది. కానీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకుండా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం. అదే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే..ఆ పార్టీనే టార్గెట్ చేసేవారు.

ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు..ఓ వైపు బీజేపీ వాళ్ళ దేశం నాశనమైపోతుందని విమర్శలు చేస్తూ…కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని, నిధులు ఇవ్వడం లేదని వాదిస్తున్నారు. ఏడాది క్రితం వరకు పెద్దగా కేంద్రంపై ఫైర్ అవ్వని కేసీఆర్..ఎప్పుడైతే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు, హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ సత్తా చాటిందో అప్పటినుంచి కేసీఆర్ ఎటాక్ మొదలైంది. పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింతగా కేంద్రాన్ని టార్గెట్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.

ఇలా బీజేపీనే టార్గెట్ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు..నిజంగానే కేసీఆర్ తప్పు ఏమి లేదని, కేంద్రం సాయం చేయడం లేదని అనుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ కనికట్టుకు చెక్ పెట్టడానికి బీజేపీ ఎప్పటినుంచో దూకుడుగా ఉంటుంది. కేసీఆర్ కేంద్రంలో రాజకీయం చేస్తే…కమలం పార్టీ తెలంగాణలో రాజకీయం చేయడానికి రెడీ అయింది. అలాగే కేసీఆర్ చేసిన తప్పులని, నెరవేర్చని హామీలని హైలైట్ చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే బండి సంజయ్ అదే పనిలో ఉన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, బెల్ట్ షాపులు, పోడు భూముల సమస్యలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితబంధు అమలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడు ఎకరాల భూమి లాంటి పథకాలు అమలు చేయకపోవడం..ఇంకా ఇతర సమస్యల విషయంలో కేసీఆర్ ని గట్టిగానే టార్గెట్ చేయాలని కమలం డిసైడ్ అయింది. మొత్తానికి టిట్ ఫర్ టాట్ అనే సూత్రాన్ని కమలం అమలు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news