ఎడిట్ నోట్: బాబు భయం!

-

నెక్స్ట్ తమదే గెలుపు…ఇంకా తమని ఎవరూ ఆపలేరు…ఖచ్చితంగా జగన్‌ని గద్దె దించుతామని పైకి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం బాగానే ప్రదర్శిస్తున్నారు గాని…లోలోపల మాత్రం ఎక్కడా అధికారంలోకి రావడం కష్టమేమో అని భయం బాబులో బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటినుంచి…బాబు మళ్ళీ టీడీపీని గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు…ఓ వైపు వైసీపీపై పోరాటం చేస్తూనే…మరోవైపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

అయితే చంద్రబాబుకు…టీడీపీ తమ్ముళ్ళు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. అధికార వైసీపీ పెట్టే కేసులకు భయపడి కావొచ్చు…ఇప్పుడు రోడ్లపైకి వచ్చి భారీగా ఖర్చు పెడితే ఎన్నికల్లో ఆర్ధిక కష్టాలు వస్తాయనే భయం కావొచ్చు…కొందరు నేతలు బయటకొచ్చి పోరాటం చేయడం లేదు. దీని వల్ల అనుకున్న దాని కంటే టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడి ఉంది. వాస్తవానికి బాబు పోరాటం, కొందరు టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం వల్ల…చాలావరకు టీడీపీ పుంజుకుంది.

అలా అని వైసీపీని దాటుకుని టీడీపీ బలం పెరగలేదు..దీనికి కారణం కొందరు టీడీపీ నేతలే…వారు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. వాస్తవానికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. దీని వల్ల పలు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపుకే అనుకూల వాతావరణం ఉంది…పైగా ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీదే అధికారం అని తేలింది.

అంటే ఇప్పటికీ వైసీపీ బలంగా ఉండటానికి కారణం…కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా లేకపోవడం. ఇక ఈ విషయంపై బాబుకు బాగా భయం ఉంది. పైగా ఈసారి ఎన్నికలు చావో రేవో లాంటివి..ఈ సారి గాని ఓడిపోతే టీడీపీ పని అంతే…అలాగే చంద్రబాబుకు కూడా ఇబ్బంది. పైగా తన భార్యని కించపరుస్తూ మాట్లాడారని చెప్పి బాబు…అసెంబ్లీలో వైసీపీ వాళ్ళకు సవాల్ చేసి మరీ బయటకొచ్చేశారు.

మళ్ళీ ప్రజా క్షేత్రంలో గెలిచి సీఎం అయ్యాకే..అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పి బయటకొచ్చేశారు. ఇక ఈ విషయాన్ని బాబు…టీడీపీ నేతలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన టీడీపీ విస్తృత్ర స్థాయి సమావేశంలో ఆ భయంతోనే బాబు..టీడీపీ నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమర్థంగా పని చేయాలని, పార్టీలో గ్రూపులు ఉండటానికి వీల్లేదని, ఇన్‌చార్జిలే పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

ఎందుకంటే తాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పానని,  అది అందరూ గుర్తు పెట్టుకోవాలని,  అలా కాకుండా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుని.. ఇంట్లో కూర్చుంటే కుదరదని, పార్టీ కోసం కష్టపడకుండా ఎన్నికల్లో సీట్లు కావాలంటే కుదరదని తేల్చి చెప్పేశారు. అంటే టీడీపీ నేతలు సరిగ్గా పంచేయకపోతే ఏం అవుతుందనే భయం బాబుకు బాగా ఉంది. అందుకే పనిచేయకపోతే సీట్లు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. మొత్తానికి బాబు భయంతోనే పనిచేస్తున్నట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news