అధికార వైసీపీలో ఉండే అంతర్గత పోరు టీడీపీకి బాగా కలిసొచ్చేలా ఉంది. బలంగా ఉండే స్థానాల్లో కూడా వైసీపీలో నడుస్తున్న పోరు పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది. దీని వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుందో ఎన్నికల్లోనే తెలుస్తుంది. అలాగే ఆధిపత్య పోరు వైసీపీ సిట్టింగ్ సీటుల్లోన కాదు. టీడీపీ సిట్టింగ్ సీటుల్లో కూడా ఉంది.
టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట..వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇచ్చాపురం సీటు టీడీపీ చేతులో ఉంది..ఇక్కడ కష్టపడితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ సాయిరాజ్‌కు వైసీపీలోనే వ్యతిరేక వర్గం ఉంది. అటు టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పేరాడ తిలక్ వర్గానికి దువ్వాడ అంటే పడటం లేదు. ఇక విశాఖ ఈస్ట్‌లో సైతం అక్రమాని విజయనిర్మల, వంశీకృష్ణల మధ్య పోరు నడుస్తోంది.
అటు రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇటు టీడీపీ కంచుకోట అయిన ఉండిలో సైతం రచ్చ నడుస్తోంది. అలాగే పర్చూరు సీటు కోసం వైసీపీలో పోరు నడుస్తోంది.
ఇక కొండపి సీటులో మాదాసి వెంకయ్య, వరికూటి అశోక్ బాబు వర్గాల మధ్య పోరు ఉంది. వాస్తవానికి టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ బలం పెరిగింది ఈ సీటులోనే కానీ వైసీపీ నేతలు..తమ రచ్చతో ఇక్కడ టీడీపీని మళ్ళీ గెలిపించేలా ఉన్నారు. గత ఎన్నికల్లో వెంకయ్య ఓడిపోయారు. తర్వాత ఆయనకు డిసిసిబి ఛైర్మన్ పదవి ఇచ్చారు. అటు కొండపి ఇంచార్జ్ పదవి అశోక్ బాబుకు ఇచ్చారు. కానీ కొండపిలో వెంకయ్య వర్గం ఏ మాత్రం అశోక్ బాబుకు సహకరించడం లేదు. అటు అశోక్ వర్గం కూడా…వెంకయ్యని లెక్క చేయడం లేదు. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఇలాగే కొనసాగితే కొండపిలో టీడీపీ హ్యాట్రిక్ కొట్టేలా ఉంది.