ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఆపరేషన్ రోప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ తరహాలో వరంగల్ సిటీలో ‘ఆపరేషన్ రోప్’ నిర్వహిస్తామని సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి సీఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషిస్తామన్నారు. నగరంలోని మెయిన్ రోడ్లలో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగటానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాంగ్ పార్కింగ్ ప్లేసుల్లో ప్రమాదకరమైన రీతిలో నిలిపిన వెహికిల్స్‌ను తరలించడం, మోటారు వాహనాలు, చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు, రహదారుల ఆక్రమణను నిరోధించడానికే ఆపరేషన్ రోప్ చేపడుతున్నట్లు వివరించారు. కమిషనరేట్ ఆఫీసులో గురువారం ట్రాఫిక్ విభాగం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్, వాటి పనితీరు, సిబ్బంది విధుల గురించి ఏసీపీ మధుసూదన్పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సిటీలో ట్రాఫిక్ నియంత్రణ బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పెట్టుబడులు వస్తాయని సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. అనవసర చలాన్లు తగ్గించాలని, నిజంగా రూల్స్ బ్రేక్ చేస్తే వదిలిపెట్టవద్దన్నారు. బైకులపైనే దృష్టి పెట్టకుండా కార్లు, ఇతర హెవీ వెహికల్స్పైనా దృష్టి పెట్టాలన్నారు. త్వరలో స్టాప్ లైన్లు, జీబ్రా లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ నుంచి స్టాప్ లైన్లు దాటి ముందుకు వస్తే జరిమానాలు విధించాలని చెప్పారు. జంక్షన్లల్లో ఆటోలు నిలపకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఆటో డ్రైవర్ల అడ్డాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులు, వైన్ షాపులు, బార్ల ముందు వెహికిల్స్ పార్కింగ్ చేసేందుకు సంబంధిత యాజమాన్యం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకునేలా చూడాలన్నారు. మీటింగ్ లో ట్రాఫిక్ ఇన్చార్జ్, అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ సీఐలు బాబులాల్, రవి కుమార్, రామకృష్ణ, ఆర్ఐ శేఖర్ బాబు ఉన్నారు.