శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అందరికీ స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. వయసొచ్చిన తర్వాత చేతికర్ర కావాల్సి వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందని, అలాగే ఒక తరం వయసు పెరుగుతున్నప్పుడు భావితరం విలువ తెలిసొస్తుందని అన్నారు. ఇప్పుడున్న నేతలు ఎంత సేపు వారి కోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు తప్ప మీకోసం ఆలోచించడంలేదు అని వ్యాఖ్యానించారు.
నేను మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని కావొచ్చు… కానీ నేను సగటు మధ్యతరగతి మనిషిని, సామాన్యుడ్ని అని తెలిపారు. “నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి. యే మేరా జహా… ఏ మేరా ఘర్ ఏ మేరా ఆషియా అన్నా గానీ ఆ చైతన్యం నాకు వచ్చింది ఉత్తరాంధ్రలోనే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని భావించే విశాఖ ఉక్కు కార్మికులు నేను నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా నిలబడ్డారు” అని వివరించారు.