మునుగోడు ఉపఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీలోకి వలసల హవా నడిచింది..బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు బిజేపిలోకి ఎక్కువగానే వచ్చారు. అలాగే బిఆర్ఎస్ పార్టీకి చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలోనే వారు కూడా బిజేపిలోకి వస్తారని, ఇంకా సంక్రాంతి పండుగ తర్వాత వలసల పర్వం కొనసాగుతుందని బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి వారు స్టేట్మెంట్స్ ఇచ్చారు.
కానీ వారు చెప్పిన విధంగా బిజేపిలోకి వలసలు ప్రస్తుతానికి లేవు. ఈ వలసలని వ్యూహాత్మకంగా ఆపేశారా? లేక అసలు బిజేపిలోకి వచ్చే నేతలు లేరా? అనే డౌట్ వస్తుంది. పైగా ఇటీవల ఖమ్మంలో బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం బిజేపిలో చేరతారని, 18వ తేదీన అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ 18 వ తేదీ దాటేసింది. అయినా ఇంతవరకు పొంగులేటి జాయినింగ్ లేదు.
అయితే పొంగులేటి మాత్రం బిఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిఆర్ఎస్ లో ఉండలేనని చెప్పేశారు..అందుకే ప్రతి నియోజకవర్గంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలు పెడుతూ..పార్టీ మారుతున్నట్లు చెబుతున్నారు. కాకపోతే ఈయన బిజేపిలో చేరతారా? లేక ఏమైనా ట్విస్ట్ ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో పొంగులేటి బిజేపిలోనే చేరే అవకాశాలు ఉన్నాయి.
కాకపోతే భారీ స్థాయిలో చేరడానికి కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి చేరాక..ఇంకా బిజేపిలోకి వలసలు మొదలవుతాయేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బిజేపిలో చేరే జంపింగ్ నేతల పేర్లు వినబడటం లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏమైనా జంపింగులు ఉంటాయేమో.