ఎడిట్ నోట్: ‘ఓట్ల’ సంక్షేమం!

-

ఇది ప్రజా బడ్జెట్..అద్భుతమైన బడ్జెట్..ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని చెప్పి అధికార బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదంతా అంకెల గారడీ, వాస్తవానికి దూరంగా ఉన్న బడ్జెట్, డొల్ల బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలు. అంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. రూ.2.90 లక్షల కోట్లను ప్రతిపాదించారు.మొత్తానికి బడ్జెట్‌లో పలు రంగాలకు ఘననీయమైన కేటాయింపులు జరిగాయి. కాకపోతే ఎప్పటిలాగానే బడ్జెట్ ఉంది తప్ప..ఈ సారి బడ్జెట్ లో పెను మార్పులు ఏమి లేవు. పైగా ఎన్నికల సమిస్తున్న వేళ కొత్త పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదు. కానీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే సంక్షేమ రంగానికి, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారని అర్ధమవుతుంది.

 

ప్రధానంగా సంక్షేమ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేశారు. దళిత బంధు పథకానికి ఏకంగా రూ. 17, 700 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.33,416 కోట్ల వరకు కేటాయించారు.కళ్యాణ లక్ష్మీ పథకానికి రూ. 3,210 కోట్లని కేటాయించారు. స్వయం ఉపాధి పథకానికి రూ.1533 కోట్లు, గురుకులాలకు రూ.2,289 కోట్లు, భోదన రుసుము, ఉపకారానికి రూ.2850 కోట్లు కేటాయించారు. అటు ఆసరా పథకానికి, రైతు రుణమాఫీకి కేటాయింపులు జరిగాయి. ఓవరాల్ గా సంక్షేమానికి కేటాయింపులు భారీగానే ఉన్నాయి. కాకపోతే పూర్తి స్థాయిలో ఖర్చు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. గత ఏడాది అనుకున్న విధంగా దళితబంధుకు బడ్జెట్ నిధులని ఖర్చు చేసినట్లు కనిపించలేదు.

అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..ఇప్పుడు కేటాయించిన నిధులని ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓట్లు రాబట్టడానికి ఈ సంక్షేమ బడ్జెట్‌ని అమలు చేస్తారని తెలుస్తోంది. కాకపోతే గిరిజన బంధు, నిరుద్యోగ భృతి విషయంలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం నిరాశ పర్చింది. మరి రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఏమైనా ఆ పథకాలని అమలు చేస్తుందేమో చూడాలి. మొత్తానికి ఈ బడ్జెట్ ఓట్లని రాల్చడం కష్టమే అన్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news