వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గత కొన్నాళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ గళం విప్పింది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను నియమించింది. ప్రధానంగా ఆ పార్టీ ఏపీలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీ ఇంచార్జిని రంగంలోకి దింపింది. విజయవాడలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రెడీ అయింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టింది. విశాఖ స్టీల్‌తో పాటు విభజన సమస్యలపై ఫోకస్ పెట్టింది.
అంతేకాదు ప్రజల్లోకి పార్టీని తీసుకుళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ వ్యూహాలనే ఏపీలోనూ అమలు చేస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో తాజాగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామన్నారు. ఏపీకి నష్టం కలిగించే కేంద్ర విధానాలపై జగన్ ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు. విభజన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు తోట చంద్ర శేఖర్.