కర్ణాటక అసెంబ్లీకి రానున్న ఎన్నికల్లో భాగంగా అధికారంలో ఉన్న 40 శాతం కమీషన్ల బీజేపీని రాష్ట్రంలో 40 సీట్లకే పరిమితం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై రాహుల్ గాంధీ పదునైన విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న 40 శాతం కమీషన్ల బీజేపీని రాష్ట్రంలో 40 సీట్లకే పరిమితం చేయాలని కోరారు. 150 సీట్లతో కాంగ్రెస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై స్పందిస్తూ… నిజం మాట్లాడటానికి పార్లమెంటు మాత్రమే ఉందనే భావనలో బీజేపీ ఉన్నట్టుందని… నిజాన్ని ఎక్కడైనా మాట్లాడొచ్చని అన్నారు. అదానీతో మీకున్న సంబంధం ఏమిటని ప్రధాని మోదీని ప్రశ్నించానని… అదానీకి ఎల్ఐసీ నిధులను ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించానని..
ఆ తర్వాత తన మైక్రోఫోన్ ను కట్ చేశారని, తన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేశారని రాహుల్ విమర్శించారు. నిజం చెప్పడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బసవన్న జయంతి ఉత్సువాలను ప్రస్తావిస్తూ, 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవన్న నమ్మకాలు, సిద్ధాంతాలను అనుసరించేందుకు బీజేపీ అనుకూలంగా లేదని అన్నారు. సమాజ సౌభ్రాతృత్వాన్ని బసవన్న కాంక్షించారని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు ఆయన విలువనిచ్చేవారని, నిజం చెప్పడానికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని అనేవారని గుర్తుచేశారు. బసవన్న గురించి బీజేపీ చాలా చెబుతుందని, కానీ వాస్తవానికి అవేవీ ఆచరణలో చూపదని అన్నారు. పేదలకు సాయపడాలని బసవన్న బోధిస్తే, మిలియనీర్లు, బిలియనీర్లకు బీజేపీ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.