మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో సింగపూర్ తరహాలో కరీంనగర్ త్వరలో అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం డేకేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఒంటరిగా ఉంటే అనారోగ్యం అని అంటారు. పదిమందితో కలిసి ఉంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందన్నారు.
కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, గడిచిన ఎనిమిదేండ్లలో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులతో నగరంలో అన్ని రోడ్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకొని సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి గంగుల చెప్పారు. నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లోనూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో రాత్రిళ్లు కూడా రహదారులు జిగేల్‌మంటున్నాయని అన్నారు.