రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భగ్గుమన్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడడం తగదని.. రాజకీయాల మీద అవగాహన పెంచుకొని మాట్లాడాలని సూచించారు. బీజేపీ ఎవరికి బి టీం అనేది విశ్వేశ్వరరెడ్డిని అడిగితే చెప్తారని అన్నారు. బీజేపీని నమ్మడం లేదని స్వయంగా విశ్వేశ్వరరెడ్డినే చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ముందు విశ్వేశ్వరరెడ్డికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక కేసీఆర్ కేవలం మూడు నియోజకవర్గాలకే సీఎం అని.. అవి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్‌కి 80 సీట్లు వస్తాయని.. తప్పకుండా తమ ప్రభుత్వమే రాష్ట్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు ఓ దగా అని ఆరోపించిన ఆయన.. ఎప్పుడూ లేనిది శంకరమ్మ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆమెకు ఓడిపోయే సీటు ఇచ్చి, ఇంకా అవమానపరిచారంటూ మండిపడ్డారు. గాయత్రీ రవికి రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్.. శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ‘తన్ని తరుముతా’ అని చెప్పిన తలసానిని మాత్రం మంత్రిని చేశాడన్నారు. దానం తరిమి కొడితే.. ఆయన్ను ఎమ్మెల్యే చేశారని చెప్పుకొచ్చారు. శంకరమ్మకు కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లుగా దగా చేసిందని ఆరోపించారు.