తెలంగాణలోని భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని నేతలకు సునీల్ బన్సల్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. పార్టీలోని అంతర్గత సంక్షోభానికి చెక్ పెట్టే దిశగా అధిష్టానం పావులు కదుపుతోంది. త్రిముఖ వ్యూహం దిశగా ఢీల్లీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. ముగ్గురికి మూడు పదవులు ఇస్తే పరిస్థితి చక్కబడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.పార్టీ పదవులను ఆశించడం తప్పేమీ కాదన్న రఘునందన్‌రావు మాటలను అధిష్టానం స్వాగతిస్తుందా అనేది కూడా నేటితో తేలిపోనుంది. ఆ పార్టీకి సునీల్ భన్సల్ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు.
మొన్నటి వరకు అంతా బాగుందనే అనిపించిన తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తీవ్ర సమస్యగా పరిణమించాయి. ఒరిజినల్ బీజేపీ నేతలతో ఇబ్బంది లేదని,ఇటీవల పార్టీలోకి వచ్చిన కొంత మంది వలన పార్టీ నాశనం అవుతోందనే ఆరోపణలు కూడి వినిపించాయి.ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో కేడర్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది అధిష్ఠానం. ప్రస్తుతం బండి-ఈటెల వర్గంగా విడిపోయిన ఈ రెండు గ్రూపులు నాయకత్వ మార్పును కోరుకుంటున్నాయి.ఈ క్రమంలోనే పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు బండి, ఈటల సహా కిషన్‌రెడ్డి సహకారంతో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బండి సంజయ్‌కి కేంద్ర సహాయమంత్రి పదవి ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని , ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమించాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.ఐతే గ్రూపులుగా విడిపోయిన నేతలు, కార్యకర్తలు ఆ తరువాత శాంతిస్తారా అనేది కూడా పార్టీలో తీవ్ర చర్చగా మారింది.
మరోవైపు పదవిపై క్లారిటీ రావడంతో ఈటల రాజేందర్ అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తనను వ్యతిరేకిస్తున్న జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మరీ లంచ్ చేసి వచ్చారాయన.పార్టీ పదవులను ఆశించడం తప్పు లేదని చెప్తూ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు.పైగా అలాంటిదేమి లేదంటూ పైకి బిల్డప్ ఇస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నారాయన. అధ్యక్షమార్పు ప్రచారం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు మందగించాయి. అయితే పార్టీలో ఇంత గందరగోళం నడుస్తున్నా కొంతమంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోతున్నారు. అయితే సునీల్ బన్సల్ రెండ్రోజుల పర్యటన తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు తెస్తుందో అనే చర్చ అంతటా నడుస్తోంది.