రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవు, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతి కుమారి స్వాగతం పలికారు. అయితే.. ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముర్ము ప్రసంగించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనవని కీర్తించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారని ముర్ము వివరించారు. అల్లూరి వంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని పిలుపునిచ్చారు. కాగా, ఏపీలో భీమవరం వద్ద నిర్మించిన అల్లూరి స్మృతి వనాన్ని గచ్చిబౌలి సభ నుంచి రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.