వచ్చే ఎన్నికల్లో తెనాలి బరిలోనే పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీలో పవన్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న ఆయన..తెనాలి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే త్వరలోనే జనసేన ఏ ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అయితే దీని ద్వారా టిడిపితో పొత్తు పెట్టుకునే జనసేన ముందుకెళుతుందని తెలుస్తుంది. లేదంటే జనసేన అన్నీ సీట్లలో పోటీ చేస్తుందని నాదెండ్ల ప్రకటించేవారు.
అలా చేయలేదంటే టిడిపి తో పొత్తు గ్యారెంటీ అని చెప్పవచ్చు. అయితే టిడిపితో పొత్తు ఉంటేనే తెనాలిలో నాదెండ్ల గెలవగలరు. గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి 30 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ-టిడిపిల మధ్య జరిగింది. వైసీపీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు పొత్తు ఫిక్స్ కావడంతో ఈ సీటుని టిడిపి త్యాగం చేయాల్సి ఉంది.
వాస్తవానికి తెనాలిలో జనసేన కంటే టిడిపికే రెట్టింపు బలం ఉంది. అక్కడ మాజీ మంత్రి ఆలపాటి రాజా టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. ఈయన కూడా బలమైన నేత. మరి నాదెండ్ల కోసం సీటు త్యాగం చేస్తారా? లేదా? అనేది చూడాలి. కాకపోతే చంద్రబాబు చెబితే రాజా తప్పుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అదే జరిగితే నాదెండ్లకు లైన్ క్లియర్ అయినట్లే.
ఇక టిడిపితో పొత్తుతో నాదెండ్లకు గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే..టిడిపి ఓట్లు జనసేన కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంతకాలం సైకిల్ గుర్తుకు అలవాటైన టిడిపి శ్రేణులు..జనసేన గుర్తుకు ఎంతమేర ఓట్లు వేస్తారనేది చూడాలి. ఒకవేళ ఓట్లు బదిలీ కాకపోతే జనసేన ఓడిపోవడం ఖాయం. అలాగే టిడిపితో పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు తీసుకుంటుందో చూడాలి.