గత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీతో పాటుగా తనపై వైసీపీ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ మరో ఉదాహరణ అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. “సిట్ నే పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తాం అనడం… తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే.
టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం.
ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు.” అని ఆరోపించారు చంద్రబాబు. కాగా రాజధాని భూములు సహా అనేక వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిన సంగతి తెల్సిందే.